Jawan Suicide INS Kalinga: విశాఖలోని భీమిలి నౌకాదళ కేంద్రం(INS కళింగ) ప్రాంగణంలో శనివారం ఓ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధుల్లో ఉన్న ఓ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్(డీఎస్‌సీ) జవాన్, తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. డీఎస్‌సీ సిపాయిగా ఐఎన్ఎస్ కళింగలో విధులు నిర్వర్తిస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన బాజీ బాబా షాహిక్ (44).. ఈ రోజు తన వద్ద ఉన్న ఏకే-47 సర్వీస్ రైఫిల్‌తో అకస్మాత్తుగా కాల్చుకున్నారు. దీంతో ఆయనతో పాటు విధుల్లో ఉన్న తోటి సిబ్బంది, సహోద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తీవ్రంగా గాయపడిన షాహిక్‌ను సిబ్బంది, సహోద్యోగులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాలు లేదా మానసిక ఒత్తిడి ఏమైనా షాహిక్ ఆత్మహత్యకు దారి తీసిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


