బీజేపీ మహిళా నేత, నటి మాధవీ లత(Madhavi Lata)కు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) క్షమాపణలు చెప్పారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడాల్సింది కాదని.. వయసు, ఆవేశం రీత్యా మాట్లాడానని పేర్కొన్నారు. ఇందుకు ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. అలాగే తన గురించి మాట్లాడిన మంత్రి సత్యకుమార్‌తో పాటు బీజేపీ నేతలపై పరోక్షంగా స్పందించారు.
తనను వైసీపీలోకి వెళ్లమంటున్న నేతలు ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలని చురకలు అంటించారు. అధికారం ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా మాట్లాడాలి అంటూ సెటైర్లు వేశారు. తాను ఫ్లెక్సీలు, పాంప్లెట్ లీడర్‌ను కాదని.. జనం గుండెల్లో ఉన్న నేతను అన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానని లేదంటే పార్టీ అవసరమే లేదన్నారు. తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని స్పష్టం చేశారు.