Sunday, July 13, 2025
Homeఆంధ్రప్రదేశ్JC Prabhakar Reddy: రప్పా రప్పా ఆడిస్తాం.. జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy: రప్పా రప్పా ఆడిస్తాం.. జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

JC Prabhakar Reddy Warning: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్ది పట్టణంలోని తన నివాసానికి రావడం ఉద్రిక్తత వాతావరణానికి దారి తీసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతో కలిసి పెద్దారెడ్డి నివాసం వైపు బయలుదేరారు. అయితే వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిన తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలించారు.

ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు ఎవరు వచ్చారో వారి ఇంటివద్దకు టీడీపీ కార్యకర్తలు వచ్చి రప్పా రప్పా ఆడిస్తారని హెచ్చరించారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అని వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు. తాము ఇంతవరకు వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లలేదన్నారు. దయచేసి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరిగొద్దని.. తిరిగితే మాత్రం వారిని గుర్తు పెట్టుకుని తగిన రీతిలో సమాధానం చెబుతామన్నారు. పోలీసులు రాకుంటే తన కార్యకర్తలు పెద్దారెడ్డికి సినిమా చూపించేవాళ్లన్నారు. పెద్దారెడ్డి ఇల్లు ఆక్రమమైదని.. త్వరలోనే పెద్దారెడ్డి ఇంటిని జేసీబీతో కూల్చివేస్తారు అని హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగుపెట్టకుండా చేస్తామని.. పట్టణానికి ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామన్నారు.

మరోవైపు పెద్దారెడ్డి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తనను చూసి జేసీ భయపడుతున్నారని తెలిపారు. తాను తాడిపత్రిలో ఉంటే వాళ్ల ఆగడాలు సాగనివ్వనని భయపడుతున్నట్లు ఉన్నారని ఆరోపించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కాళ్లు పట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని తన ఇంటిని కూలగొట్టడానికి చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన వెల్లడించారు.

కాగా 2024 ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా తాడిపత్రిలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనను తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లడం.. ఆయనను పలు మార్లు పోలీసులు చేత అరెస్ట్ చేయించం రాజకీయ కాక రేపాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉండటంతో జేసీ కూడా అదే పంథాలో నడుస్తున్నారు. మొత్తానికి తాడిపత్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News