JC Prabhakar Reddy| టీడీపీ ఫైర్ బ్రాండ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పట్టణంలో పరిశుభ్రత పాటించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వీధుల్లో చెత్త వేస్తే వాటర్, కరెంట్ కట్ చేయిస్తానని హెచ్చరించారు. బీటెక్ చదివిన ఓ యువతి తాను ఇచ్చిన స్థలంలో కాకుండా రోడ్డుపైన వ్యాపారం చేసుకుంటుందని.. ఇక బీటెక్ చదివి ఏం లాభమని నిలదీశారు. ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకున్న ప్రజలు కూడా పారిశుద్ధ్యంతో పాటు క్రమశిక్షణ చర్యలు పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఫైర్ అయ్యారు.
కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ హయాంలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి.. 1987 నుంచి 1992, 2000 నుంచి 2005వరకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా, 2005 నుంచి 2010 వరకు వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2014లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.