Journalist Patri Vasudevan Goes Missing : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జర్నలిస్టు పత్రి వాసుదేవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచాఫ్ చేశారు. ప్రస్తుతం వాసుదేవన్ అదృశ్యం కావడంతో పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.
అసలేం జరిగిందంటే
జులై 20న ‘99 టీవీ’లో ప్రసారమైన ఒక చర్చా కార్యక్రమంలో వాసుదేవన్ మాట్లాడుతూ, జగన్‌ను హత్య చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు రాష్ట్రంలోకి వచ్చి, ఆయన పర్యటనల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో కలవరం రేకెత్తించడంతో పాటు వర్గాలు, ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించేలా ఉన్నాయని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో గుంటూరుకు చెందిన జనసేన నాయకుడు యర్రంశెట్టి సాయినాథ్ ఫిర్యాదు మేరకు జులై 22న నల్లపాడు పోలీసులు వాసుదేవన్‌పై కేసు నమోదు చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-government-ban-political-activities-in-schools/
పోలీసులు ఈ వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశం, ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వివాదం తలెత్తిన వెంటనే వాసుదేవన్ కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. ఈ క్రమంలోనే పోలీసులు జులై 26న హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ‘41ఏ’ నోటీసు జారీ చేసేందుకు వెళ్లారు. కానీ, అప్పటికే ఆయన అక్కడ లేరు. దీంతో పోలీసులు ‘99 టీవీ’ యాజమాన్యాన్ని సంప్రదించి, ఛానల్ సీఈఓతో పాటు ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వాంగ్మూలం తీసుకున్నారు. వాసుదేవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఆయన వద్ద ఉన్న సమాచారం గురించి తమకు తెలియదని చీఫ్ ఎడిటర్ భావనారాయణ స్పష్టం చేశారు.
వాసుదేవన్‌ను జులై 29న విచారణకు గుంటూరు పంపుతామని వారు చెప్పడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. అయితే జులై 29న వాసుదేవన్ విచారణకు రాకపోవడంతో, ఆ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో అదేరోజు ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వాసుదేవన్ కథనంపై తమకెలాంటి సమాచారం లేదని, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలున్నాయో తెలియదని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వాసుదేవన్ అందుబాటులో లేనందున, పోలీసులు ఆయన వ్యాఖ్యల వీడియోలు, గతంలో చేసిన విశ్లేషణలను పరిశీలిస్తున్నారు. చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని నల్లపాడు సీఐ వంశీధర్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, వాసుదేవన్ వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


