JP Nadda Comments on AP Development: ప్రధాని నరేంద్ర మోఢీ, ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభలో పాల్గొని మాట్లాడిన ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంభించిందన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్‌డీఏ సారథ్యంలో దేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకెళ్తోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందుగానే దసరా, దీపావళి తీసుకొచ్చాం. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం. సాగర్‌మాల పేరుతో 14 పోర్టులు నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇచ్చాం. రైల్వేలో అమృత్ భారత్, వందే భారత్ తెచ్చాం. విశాఖ, విజయవాడ, ఓర్వకల్లును అభివృద్ధి చేశాం. భోగాపురానికి రూ.625 కోట్ల నిధులు ఇస్తున్నాం. ఆరు కొత్త వైద్య సంస్థలు ప్రారంభించాం.” అని ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రపంచంలో అతి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని గుర్తు చేశారు.
గత ప్రభుత్వాలవి అసమర్థ, వారసత్వ రాజకీయాలు..
2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు నడిచేవని, అప్పట్లో దేశంలో అవినీతి రాజ్యమేలిందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 2014కు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో తీసుకొచ్చి ఎన్నికలయ్యాక మరిచిపోయేవారని ఆరోపించారు. వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారని గుర్తు చేశారు.
625 కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్ట్..
రైల్వేల విషయానికి వస్తే అమృత్ భారత్ స్టేషన్లు, పట్టాలమీద వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుందని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్, స్పెషాలిటీ ఆస్లత్రులు, కొత్తగా 17 వైద్య కళాశాలలు వచ్చాయని, దేశంలో విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం 625 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతోందని, విశాఖ రైల్వే జోన్ సిద్ధమైందని గుర్తు చేశారు. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, సెమీకండక్టర్స్ ప్రాజెక్టు ఏపీకి వచ్చిందని తెలిపారు. ఇక, మోదీ, చంద్రబాబు నాయకత్వలో కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్ సిటీలో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతోందని జోస్యం చెప్పారు. 3300 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించిందని, 6 కొత్త వైద్య సంస్థలను మంజూరు చేసిందని, కోటి ఇరవై లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.


