AP High court Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఇప్పటివరకూ ఏ మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టలేదు. కానీ, ఈ సారి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ న్యాయ పీఠం ఎక్కనున్నారు. దీంతో రాష్ట్ర న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్ర మొదలైంది.
ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ లీసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు సీజేగా సిఫార్సు చేయడం విశేషం. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్ అయిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ లీసా గిల్ బదిలీతో పాటు నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు జస్టిస్ లీసా గిల్ తొలుత ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ చేశాక ఆమె ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు.

