Kadapa SP| కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్టుల గురించి రవీంద్రరెడ్డిపై ఫిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడం.. వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఎస్పీపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. అలాగే కడప జిల్లాలో మరో సీఐని కూడా సస్పెండ్ చేసింది.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టేవాడు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, అనితపై చెప్పలేని భాషలో పోస్టులు పెట్టాడు. దీంతో అతడిపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చిన వదిలేశారు. అయితే మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఎస్పీపై బదిలీ వేటు వేసింది.