Kadapa Steel Plant works: వైఎస్సార్ కడప జిల్లాలో ఎంతోకాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న స్టీల్‌ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మెటల్ పరిశ్రమ విస్తరణలో భాగంగా కీలక అడుగు వేసింది. సున్నపురాళ్లపల్లెలో JSW స్టీల్ సంస్థ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశకు రూ.4,500 కోట్ల పెట్టుబడి కేటాయించబడింది. 2026 జనవరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభించి, అదే ఏప్రిల్‌లోపు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశకు రూ.11,850 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. దీనిని 2031 జనవరి నాటికి ప్రారంభించి, 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక వేసుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.
ఈ రెండు దశలపైనా రాష్ట్ర పరిశ్రమల శాఖ, జేఎస్‌డబ్ల్యూ సంస్థ సమన్వయంతో కార్యాచరణ రూపొందించాయి. ఒకసారి పూర్తయితే, ఈ ప్లాంట్ రాష్ట్రానికి మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా నిలవనుంది. ప్లాంట్ నిర్మాణం కోసం సున్నపురాళ్లపల్లెలో 1,100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రతిఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఈ భూములు సంస్థకు అప్పగించబడ్డాయి. ఈ ప్రక్రియలో రైతుల భద్రత, పరిహార పథకాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే ప్రాజెక్ట్ ప్రాంతంలో సర్వేలు నిర్వహించి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే గతంలో ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజ జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం, అనేక ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ పునఃప్రారంభం జరుపుతోంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉత్సాహంగా పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో కడప జిల్లాలో వేలాది ఉద్యోగాలు కలుగనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభించనుంది. అంతేకాక, ఇక్కడి యువతకు పరిశ్రమలో శిక్షణ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక స్థాయిలో తక్కువ వ్యవధిలోనే ఆర్థిక వృద్ధి ప్రారంభమవుతుంది. సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ స్థాపనతో ఏపీ పరిశ్రమల రంగంలో ఒక కొత్త దశ ప్రారంభం కానుంది. ఇది కేవలం ఒక పరిశ్రమ ఏర్పాటే కాకుండా.. ఆ ప్రాంత అభివృద్ధికి, స్థానికులకు జీవితంలో స్థిరతకు, రాష్ట్రానికి పారిశ్రామిక శక్తిగా ఎదగడానికీ ఒక పెద్ద అడుగుగా నిలవనుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తవనుంది? ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రానుంది.. అనుకున్న గడువుకే మన ముందుకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.


