Homeఆంధ్రప్రదేశ్Janmashtami : మురిసిన మురళీలోలుని లోగిళ్లు.. కాకినాడ జిల్లాలో కృష్ణాష్టమి వైభవం

Janmashtami : మురిసిన మురళీలోలుని లోగిళ్లు.. కాకినాడ జిల్లాలో కృష్ణాష్టమి వైభవం

శంఖవరం (తెలుగుప్రభ) : నీలమేఘ శ్యాముని జన్మదిన వేడుకలతో పల్లెసీమలు పరవశించిపోయాయి. మురళీగానలోలుడి నామస్మరణతో పల్లె వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. కాకినాడ జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజల మంత్రోచ్ఛారణలు, వీధుల్లో కోలాటాల చప్పుళ్లు, ఉత్సాహంగా సాగిన ఉట్టికొట్టుడు సంబరాలు పల్లెల్లో పండుగ వాతావరణాన్ని పతాక స్థాయికి చేర్చాయి.

- Advertisement -

వేదోక్తంగా వేణుమాధవునికి పంచామృతాభిషేకం : ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ వేణుమాధవ స్వామి ఆలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేళంగి నూకరాజు పర్యవేక్షణలో ఆలయాన్ని వివిధ రకాల శోభాయమాన పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నూతన పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో ముస్తాబైన స్వామివారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు.

వేదికపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అర్చకులు వేమకోటి త్రినాథ్ శర్మ, సత్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, శుద్ధి పుణ్యాహవాచనం, మండపారాధన, నవగ్రహారాధనతో పాటు శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్ర నమకం, చమకం పఠిస్తూ స్వామికి విశేష పంచామృతాభిషేకం గావించారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం మంత్రపుష్ప నీరాజనాలు సమర్పించారు. చిన్నారులు బుడిబుడి అడుగులతో బాలకృష్ణుని వేషధారణలో వచ్చి తిలకించిన భక్తులను కట్టిపడేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

పల్లకీ సేవ.. వీధుల్లో ఉట్టికొట్టుడు సంబరం : కత్తిపూడి ఆర్కే నగర్ యాదవ్ వీధిలోని శ్రీ కృష్ణాలయంలో కృష్ణాష్టమి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే అభిషేకాలు, విశేష అలంకరణలు భక్తిభావంతో సాగాయి. అనంతరం శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు పొడవునా భక్తులు మంగళహారతులు సమర్పిస్తూ, కోలాటాలు, భజనలతో గోవింద నామస్మరణ చేయడంతో వీధులన్నీ పులకించాయి.

సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఉట్టి కొట్టుడు’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పోటీలో స్థానిక యువకులు ఉత్సాహంగా తలపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో గింజాల స్వామి ఉట్టిని కొట్టి విజేతగా నిలిచారు. విజేతకు శ్రీ కృష్ణాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్.ఎస్.ఆర్. శ్రీకృష్ణ భగవానుని చిత్రపటాన్ని బహూకరించి అభినందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువత ఆధునిక కాలంలోనూ భారతీయ సాంప్రదాయ క్రీడలను, సంస్కృతిని కాపాడుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డపు నూకరాజు, ఐతు రాజబాబు, ఇసరపు హరీష్, ఉప్పల శ్రీను, ఐతు శివ, బంధం రామకృష్ణ, చిడగల మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రపాలెం గోశాలలో ‘గోసేవే గోవింద సేవ’ : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం కేవలం పూజలకే పరిమితం కాకుండా జీవకారుణ్య సేవా భావాన్ని చాటిచెప్పింది. కాకినాడ ఇంద్రపాలెం గోశాలలో ‘చేయూత చారిటబుల్ సొసైటీ’ అధ్యక్షులు డాక్టర్ ఎం. రవికుమార్ ఆధ్వర్యంలో 150 గోమాతలకు ప్రత్యేక ఆహార సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ‘గోసేవే గోవింద సేవ’ అనే నినాదంతో గోవులకు బెండకాయలు, సొరకాయలు, అరటిపండ్లు, పచ్చికూరలు తదితర పోషకాహారాన్ని అందజేశారు.
సమాజంలో మూగజీవాల పట్ల దయాభావాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సేవా యజ్ఞంలో స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు విశేషంగా భాగస్వాములయ్యారు. భక్తి, సంస్కృతి, సామాజిక బాధ్యత కలగలిసి కాకినాడ జిల్లాలో కృష్ణాష్టమి పర్వదినం భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News