Vijayawada Kanaka Durga Dasara celebrations 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి శరన్నవరాత్రి శోభతో పునీతమవుతోంది.అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. అయితే, గంటల తరబడి వేచి ఉండే అగచాట్లు లేకుండా సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శన భాగ్యం ఎలా దక్కనుంది? అధికారులు అమలు చేస్తున్న పక్కా వ్యూహం ఏమిటి?
సాధారణ టిక్కెట్లకు స్వస్తి – ఉచితానికే ప్రాధాన్యం : గతంలో అమల్లో ఉన్న రూ.100, రూ.300, రూ.500 దర్శన టిక్కెట్లను రద్దు చేశారు. ఆ మార్గాలను ఉచిత క్యూలైన్లుగా మార్చి మొత్తం ఐదు లైన్ల ద్వారా నిరంతరాయంగా భక్తులను అనుమతిస్తున్నారు. వీఐపీలు, ప్రోటోకాల్ ప్రముఖులకు కేవలం ఉదయం 6:00–8:00, రాత్రి 8:00–10:00 గంటల మధ్య మాత్రమే దర్శన సమయాన్ని పరిమితం చేశారు. రూ.1,000 ‘త్వరిత దర్శనం’ టిక్కెట్లను ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా పొందే వీలు కల్పించారు; వీరిని కుమ్మరిపాలెం నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైకి చేరుస్తారు.
హైటెక్ నిఘా – విస్తృత సౌకర్యాలు : కొండపైకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. కొండపై వినాయక గుడి నుంచి 1,650 మీటర్ల మేర క్యూలైన్లు నిర్మించగా, ఒకేసారి 8,500 మంది వేచి ఉండవచ్చు. దాహార్తి తీర్చేందుకు 54 తాగునీటి కేంద్రాలు, 370 మరుగుదొడ్లు, 600 షవర్ పాయింట్లు సిద్ధం చేశారు. కొత్త అన్నదాన భవనంలో నిత్యం 15,000 మందికి ఉచిత భోజనం, కనకదుర్గ నగర్లో లడ్డూ కౌంటర్లు, సరికొత్త లడ్డూ ఏటీఎం ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో 5,000 మందికి పైగా సిబ్బంది భక్తుల సేవలో నిరంతరం శ్రమిస్తున్నారని ఆలయ ఈవో వి.కె. సీనా నాయక్ వెల్లడించారు.

