Home Minister Vangalapudi Anitha: ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునేవారి కుట్రలను ఉపేక్షించబోం. బాధితులకు న్యాయం అందించేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదు’ అని ఆమె కుల రాజకీయాలపై సంచలన హెచ్చరిక చేశారు. ఈ హత్య కేవలం స్నేహితుల మధ్య మొదలైన చిన్నపాటి ఆర్థిక లావాదేవీల వివాదం కక్ష సాధింపుల వరకూ వెళ్లి, కిరాతక హత్యకు దారి తీసిందని హోంమంత్రి స్పష్టం చేశారు.
బాధితులకు భారీ పరిహారం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు:
హత్య జరిగిన వెంటనే పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని అనిత వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాధితుని కుటుంబానికి న్యాయం చేసేందుకు, ఈ కిరాతక ఘటనను త్వరగా పరిష్కరించేందుకు కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు.
అంతేకాక, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు రూ.5 లక్షల నగదు, రెండు ఎకరాల భూమి, ఇద్దరు పిల్లలకు చెరో రెండు ఎకరాల భూమి, రూ. 5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ అందివ్వనున్నారు. పిల్లల విద్యా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.


