Kasibugga Stampede Tragedy: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం చోటుచేసుకున్న తీవ్ర విషాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు – ఆలయంలో ఏం జరిగింది?
కార్తిక మాసం కావడంతో శనివారం ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం 11:45 గంటల సమయంలో, భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాట కాస్తా తీవ్రమైన తొక్కిసలాట (Stampede)కు దారితీయడంతో, ఊపిరాడక, కింద పడి పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. .
ప్రభుత్వ పరామర్శ, ఆర్థిక సాయం
ఘటన తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడింది. తాజాగా, టెక్కలి నియోజకవర్గం పరిధిలోని పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు, ఈ తొక్కిసలాట ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా మృతుల కుటుంబాలకు అందుతుందని తెలిపారు. “ధైర్యంగా ఉండండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి” అని భరోసా ఇచ్చారు. ఈ హృదయ విదారక ఘటనపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆలయాల్లో భద్రత, రద్దీ నియంత్రణపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఈ దుర్ఘటన మరోసారి స్పష్టం చేసింది.


