Kaveri Travels Offices closed : కర్నూలు జిల్లా NH-44 రహదారిపై తెల్లవారుజామున ఘోర దుర్ఘటన సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ దెబ్బతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుని, ఇంధన ట్యాంక్‌ను తాకడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఈ బస్సు మొత్తం అగ్నికీలలలో మునిగిపోయింది. 20 మందికి పైగా సజీవ దహనమైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 12 మంది గాయపడ్డారు, వారిలో కొందరు తీవ్ర బర్న్స్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ALSO READ: CM Chandrababu: రెండో రోజు యూఏఈలో చంద్రబాబు.. 12 ప్రముఖ టెక్నాలజీ కంపెనీలతో సమావేశం
ప్రమాదం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగింది. బస్సు డ్రైవర్ బైక్‌ను తప్పించుకోవడానికి ప్రయత్నించినా, దెబ్బ తప్పలేదు. ఇంధన ట్యాంక్ పేలి మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరిగెత్తారు. 12 మంది ఒక విండో బ్రేక్ చేసి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలినవారు మంటల్లో చిక్కుకున్నారు. బైక్ డ్రైవర్ కూడా మరణించాడు. మృతదేహాలు కాలిపోయి గుర్తించడం కష్టమవుతోంది. ఫైర్ టెండర్లు, 108 ఆంబులెన్స్‌లు చేరి రక్షణ చర్యలు చేపట్టాయి.
ఈ ఘటన నేపథ్యంలో కావేరి ట్రావెల్స్ యాజమాన్యం హైదరాబాద్‌లోని అన్ని కార్యాలయాలు మూసివేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఫోన్లు రిసీవ్ చేయకపోవడం, యాజమాన్యం అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ బస్సుపై గతంలో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి 16 చలాన్లు విధించినట్లు తెలిసింది. రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు వేలాది రూపాయల చొప్పు విధించారు.
బస్సులో హైదరాబాద్ ప్రాంతాల నుంచి పలువురు ప్రయాణికులు ఎక్కారు. కూకట్‌పల్లి నుంచి హర్ష, రామిరెడ్డి, సూర్యలు క్షేమంగా బయటపడ్డారు. కానీ, ధాత్రి, చందన, మంగా, అమృత్ కుమార్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. సూరారం నుంచి గుణ సాయి సురక్షితంగా బయటపడ్డారు. బహదూర్‌పల్లి నుంచి సుబ్రహ్మణ్యం బయటపడ్డాడు కానీ, ప్రశాంత్ ఫోన్ కలవడం లేదు. గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఎక్కిన సత్యనారాయణ, చింతల్‌లో వేణు గుండాల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. పీఎం మోదీ కూడా రూ.2 లక్షలు ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ “ఈ విషాదం తీవ్రంగా కలచివేసింది” అని చెప్పారు. రోడ్డు భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు రాకుండా బస్సుల ఇన్స్పెక్షన్లు, డ్రైవర్ ట్రైనింగ్ మెరుగుపరచాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.


