YSRCP vs TDP 2026: “కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారని దుయ్యబట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎన్ని జైళ్లకు పంపినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం తప్ప వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించిన సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అరెస్టులు.. అక్రమ కేసులు..
జోగి రమేష్, ఆయన సోదరుడు రామును నకిలీ మద్యం నెపంతో 83 రోజుల పాటు జైల్లో పెట్టడం కేవలం రాజకీయ కక్షసాధింపేనని కేతిరెడ్డి మండిపడ్డారు. జోగి రమేష్‌ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టడం ఈ ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనమని విమర్శించారు. తనపై ఉన్న కేసులను ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ కింద కొట్టేయించుకోవాలని చూస్తున్న చంద్రబాబు, సాక్ష్యాధారాలు లేని కేసుల్లో ఇతరులను ఎలా వేధిస్తారని ప్రశ్నించారు. ఒక కేసులో ఫిర్యాదుదారుడైన వ్యక్తి మరో కేసులో అప్రూవర్‌గా మారడం దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? అని నిలదీశారు.
Also Read:TDP 2.0: – 43 ఏళ్ల టీడీపీ.. 48 ఏళ్ల ‘యువగళం’
చంద్రబాబుకు కేతిరెడ్డి సవాల్!
మద్యం పాలసీపై కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు జిల్లా నుంచే కల్తీ మద్యం తయారై రాష్ట్రమంతా సరఫరా అవుతోంది. ధర్మవరంలో తనిఖీ చేస్తే ఇప్పటికీ 70 శాతం కల్తీ మద్యమే దొరుకుతుంది. బెల్టు షాపులు రద్దు చేస్తానన్న బాబు, ఇప్పుడు ఊరికో నాలుగు షాపులు తెరిపించారు.”
అత్యాచారాలు చేసిన వారు లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయని, అలాంటప్పుడు లోకేష్‌ను కూడా ముద్దాయిగా చేరుస్తారా? అని ప్రశ్నిస్తూ, చట్టం అందరికీ ఒకటే ఉండాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ, వైఎస్సార్‌సీపీ నేతలు దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

