Key changes in AP Inter First Year examination system: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది. పబ్లిక్ పరీక్షల్లో మొత్తం పేపర్లను ఐదుకి తగ్గించింది. గతంలో ఆరు పేపర్లు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి గణితం-1A, 1Bలను ఒకే పేపర్లో 100 మార్కులకు కేటాయించింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు ఇకపై 85 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. జువాలజీ, బోటనీ పేపర్లు కూడా 85 మార్కులకు ఇస్తారు.
గత పరీక్ష విధానంలో మార్కులు..
గతంలో మొత్తం 6 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించేవారు. అందులో ఇంగ్లీష్ 100, సెకండ్ లాంగ్వేజ్ 100, గణితం 1A 75, గణితం 1B 75, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, బోటనీ 60, జువాలజీ 60 మార్కులు కేటాయించారు. ఇలా మొత్తం సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించేవారు. అయితే, తాజా మార్పులతో ఇంగ్లీష్ 100 మార్కులు, సెకండ్ లాంగ్వేజ్ 100 మార్కులు, గణితం 100 మార్కులు, ఫిజిక్స్ 85 మార్కులు, కెమిస్ట్రీ 85 మార్కులు, బయోలజీ(బోటనీ+ జువాలజీ) 85 మార్కులు ఇలా ఎంపీసీ విద్యార్థులకు మొత్తం 470 మార్కులు, బైపీసీ విద్యార్థులకు మొత్తం 455 మార్కులు కేటాయించారు. మరోవైపు, ఇంటర్ సెకండియర్‌లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా మొదటి ఏడాదిలో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్ 100 మార్కులకు నిర్వహించనున్నారు. అలాగే, ఒక్క మార్కు ప్రశ్నల విధానం అమలు చేయనున్నారు. ఆన్సర్ బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు. ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా టైమ్ టేబుల్ రూపొందించారు.
పాత పద్ధతిలోనే సెకండియర్ ఎగ్జామ్స్..
అయితే, సెకండియర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంటర్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, నాలుగు మెయిన్ సబ్జెక్టులతో మొత్తం 6 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, మూడు మెయిన్ సబ్జెక్టులతో కలిపి మొత్తం 5 పేపర్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అన్ని గ్రూప్‌లలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు అలాగే ఇంగ్లిష్ తప్పనిసరి చేశారు.

