ఏపీలో ఇంటర్ పరీక్షల(Inter Exams)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే పరీక్ష పేపర్లలోనూ మార్పులు చేయనుంది. గణితంలో A,B రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా.. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా.. రెండు లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా చేసింది. ఈమేరకు త్వరలోనే తీర్మానాలు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.
కాగా జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(NCERT) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రతిపాదనపై విమర్శలు రావడంతో ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టరని, దీంతో అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయని సూచనలు వచ్చాయి. మెజార్టీ వ్యక్తుల అభిప్రాయం మేరకు ప్రథమ సంవత్స పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.