దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జైల్లో వంశీతో వైసీపీ అధినేత జగన్(Jagan) ములాఖత్ అయ్యారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తాజాగా జగన్ విమర్శలపై మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra), గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ వీడియోలో ఈనెల 11న వంశీ నివాసముండే మైహోమ్ భుజా అపార్టమెంట్‌లోని లిఫ్ట్‌లో సత్యవర్థన్‌ను వంశీ తీసుకెళ్తున్నారు.
అనంతరం మంత్రి కొల్లు మాట్లాడుతూ.. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పులివెందుల ఫ్యాక్షనిజం రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దళిత యువకుడైన సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేశారనడానికి సీసీ ఫుటేజ్ దృశ్యాలే సాక్ష్యమని తెలిపారు.