Konaseema’s Spiritual Pride:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అపురూప సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో, ఉత్సవ ఏర్పాట్లు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
ఏకాదశ రుద్రుల కొలువు: ఆధ్యాత్మిక వైభవం
కోనసీమలో సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన ‘కనుమ’ నాడు ఈ తీర్థం జరుగుతుంది. అంబాజీపేట మండలం మొసలపల్లి పరిధిలోని జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులు (11 గ్రామాల శివలింగాలు) ప్రభల రూపంలో ఒకే చోట కొలువుదీరడం ఇక్కడి ప్రధాన విశేషం. లోక కల్యాణం కోసం, ప్రజా క్షేమం కోసం ఆ పరమశివుని 11 రూపాలు ఇక్కడ సమావేశమై చర్చించుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Also Read: CM Chandrababu-ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు P- 4 కార్యక్రమం- సీఎం చంద్రబాబు
ఈ ఉత్సవంలో మొసలపల్లి భోగేశ్వర స్వామి ప్రభ తొలిగా జగ్గన్నతోటకు చేరుకోగా, చివరగా గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ ఎగువ కౌశిక నదిని దాటుకుంటూ రావడం అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. పచ్చని కొబ్బరి తోటల మధ్య, నదీ పాయలను దాటుకుంటూ భారీ ప్రభలు ఊగుతూ వస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు.
రికార్డు స్థాయిలో ఏర్పాట్లు
రాష్ట్ర పండుగ హోదా దక్కడంతో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది సుమారు 5 నుండి 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అంబాజీపేట పరిసరాల్లో 300 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలతో పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఇప్పటికే కొత్తపేటలో భారీ బాణసంచా ప్రదర్శనతో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల కాంతులీనే ప్రభలు, డప్పు వాయిద్యాలు కోనసీమను శివనామస్మరణతో ముంచెత్తుతున్నాయి. కోనసీమ వ్యాప్తంగా సుమారు 160 చోట్ల ప్రభల తీర్థాలు జరుగుతున్నప్పటికీ, జగ్గన్నతోట తీర్థానికి ఉన్న ప్రాముఖ్యత అద్వితీయం. ఆధునిక కాలంలోనూ అచ్చమైన గ్రామీణ సంస్కృతిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఈ మహోత్సవం తెలుగువారి వారసత్వ సంపదకు నిలువుటద్దంగా నిలుస్తోంది

