నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరిగింది. కారుతో ఢీ కొట్టి పరారయ్యాడో యువకుడు. శ్రీనివాసులు ఇంటి ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. శ్రీనివాసులురెడ్డి కుమారుడితో.. అతని స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి గొడవపడ్డాడు. మద్యంమత్తులో ఉన్న రాజశేఖర్ రెడ్డిని శ్రీనివాసులు రెడ్డి మందలించాడు. కోటంరెడ్డి శ్రీనివాసులు కుమారుడు ప్రజయ్, రాజశేఖర్ రెడ్డి స్నేహితులు.. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రజయ్ ఇంటికి వచ్చాడు. మద్యంమత్తులో ప్రజయ్ తో గొడవపడ్డాడు.
తనకుమారుడితో గొడవ పడుతున్న రాజశేఖర్ రెడ్డికి శ్రీనివాసులు సర్దిచెప్పి పంపారు. బయటికి వెళ్లినట్టే వెళ్లి.. తన కారును పక్కకు ఆపి వేచిచూశాడు రాజశేఖర్ రెడ్డి. శ్రీనివాసులు బయటకు రాగానే తన కారుతో ఢీ కొట్టి పారిపోయాడు. గాయపడిన శ్రీనివాసులును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కోటంరెడ్డిని పరీక్షించిన వైద్యులు.. ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. మూడు క్యాపిటల్స్ కాకుండా.. క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నెల్లూరును ప్రకటించినట్టుగా ఉందని విమర్శించారు. వైసీపీ సానూభూతిపరుడైన సైకో రాజశేఖర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.