రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వై. యస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ కొత్తపల్లి మండలంలో గువ్వలకుంట గ్రామంలో పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలులో అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ, నవరత్నాలు పథకాలు లబ్ది పొందడం ద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా వుండాలనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గువ్వలకుంట గ్రామం పర్యటనలో భాగంగా ప్రభుత్వ సచివా లయంను సందర్శించి సచివాలయం ఉద్యోగుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. తరువాత సచివాలయం పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం సందర్శించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చిన్న పిల్లలకు, అందించే పోషక ఆహారం సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, పిల్లల ఆరోగ్య పరిరక్షణ సక్రమంగా అమలు చెయ్యాలని సిబ్బందికి సూచించారు. తదనంతరం ప్రతిరోజూ గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత పరిశీలించడానికి ఆహార పదార్థాలను స్వయంగా తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
