ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమర్జనోత్సవాన్ని జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 26 వ తేదిన కర్నూలు నగరంలో ఘనంగా జరిగే గణేష్ నిమర్జనం సందర్భంగా రాంభొట్ల దేవాలయము, వినాయక ఘాట్ , జొహరాపురం సమీపంలో కేసీ కెనాల్ గేట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అధికారులతో కలిసి ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ నిమర్జనోత్సవం సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో నిమర్జనోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉండడం వల్ల కేసి కెనాల్ లో దాదాపు 8 అడుగుల నీరు ఉండేలా నీటిని వదులుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటగా రామ్ బొట్ల దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని, ఓల్డ్ టౌన్ నుండి వినాయక విగ్రహాలు వచ్చే రహదారిని పరిశీలించారు. రహదారి పొడవున ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ కావలసిన విధంగా లైట్లు , త్రాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ క్రేన్ల సహాయంతో నిమజ్జన కార్యక్రమము వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
మత్స్య శాఖకు సంబంధించి 120 మంది గజ ఈతగాళ్ళను, లైఫ్ జాకెట్ లను ఘాట్ వద్ద ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని అదేశించారు. కేసి కెనాల్ లో నీటిని 8 అడుగులు ఉండేలా, జొహరాపురం దగ్గర ఉన్న కేసి కెనాల్ గేట్లను మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ప్రజలు గణేష్ నిమర్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, నగర మేయర్ బి వై రామయ్య, కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్, ఇరిగేషన్ ఎస్.ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్.ఈ నాగరాజు, ఫిషరీస్ జె.డి శ్యామల ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.