Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool collector: 'బనవాసి' నర్సరీ అభివృద్ధి చేస్తాం

Kurnool collector: ‘బనవాసి’ నర్సరీ అభివృద్ధి చేస్తాం

హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం

బనవాసి నర్సరీని మరింతగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.
గోనెగండ్ల మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, ఎమ్మిగనూరు మండలం బనవాసి సెంట్రల్ నర్సరీనీ,పశుసంవర్థక పాలిటెక్నిక్ కళాశాలను, ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా గోనెగండ్ల మండల కేంద్రంలోని జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలిస్తూ అక్కడ ఉన్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ మీరు రోజు ఏ సమయానికి వస్తున్నారు, మీకు త్రాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారా లేదా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పనులకు వస్తున్నామని పనులు చేస్తున్న సమయంలో త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారని కూలీలు కలెక్టర్ కి వివరించారు. కలెక్టర్ ముఖ్యంగా అక్కడ ఉన్న మహిళ కార్మికులతో మాట్లాడుతూ మీ పిల్లలను బాగా చదివించాలని, చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయవద్దని వారికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు తీర్చిదిద్దుతుందని మీ పిల్లలను పాఠశాలలకు పంపించి వారిని బాగా చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. అనంతరం ఉపాధి కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన మెడికల్ కిట్లను పరిశీలించి, ఉపాధి కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను అందచేశారు.
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సెంట్రల్ నర్సరీ ని రాష్ట్రంలోనే ఎన్ఆర్ఈజిఎస్ కింద బాగా అభివృద్ధి చేసిన నర్సరీ అని పేర్కొన్నారు. ఈ నర్సరీలో మామిడి, సపోటా లాంటి ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారని తద్వారా జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అలాగే ఇక్కడ పెంచుతున్న మొక్కలను అటవీ శాఖ అధికారులకు, విద్యా సంస్థలకు, కార్యాలయాలకు,రైతులకు అవసరం మేరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నర్సరీ ఒక విజ్ఞాన కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడేలా ఉందని కలెక్టర్ తెలిపారు. ఫారం పాండ్స్ ఎలా ఏర్పాటు చేయాలి, నీటిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలి, ఏ విధమైన పంటలు కలిపి పండించవచ్చు అనే విషయాలను నర్సరీ ద్వారా తెలుసుకునేలా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నర్సరీని మరింతగా రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. నర్సరీ లో రెండు బోర్లు ఉన్నాయని ఇంకా అదనంగా మూడు ఫారం పాండ్స్ ఏర్పాటు చేశారని, వీటి వల్ల భూసాంద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి నర్సరీలు జిల్లాలో బనవాసి, ఆలూరు, కాల్వబుగ్గ నందు ఉన్నాయని అందులో వివిధ రకాల మొక్కలు, పండ్ల చెట్ల పెంపకం చేపడుతున్నామని, ఈ నర్సరీ నందు ఎక్కువ శాతం మునగ, కానుగ తదితర చెట్లు పెంచుతున్నామని డ్వామా పిడి కలెక్టర్ కి వివరించారు. ఈ నర్సరీ నందు కూరగాయల పెంపకం కూడా చేపట్టామని అయితే కొంత జింకల బెడద ఉందని అందుకుగాను ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇక్కడ పనిచేస్తున్న వారి కోసం ఒక గది, వాష్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని డ్వామా పిడి కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నర్సరీ నందు కలెక్టర్ మామిడి మొక్కను, ఆదోని సబ్ కలెక్టర్ టెంకాయ మొక్కను నాటారు.


ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశుసంవర్థక పాలిటెక్నిక్ కళాశాల నందు తరగతి గదులను, ప్రయోగశాలలను, ప్రిన్సిపల్ గదిని పరిశీలించారు. అక్కడే ఉన్న పశుసంవర్థక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు కళాశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయించాలని, కళాశాల బయట బస్ షెల్టర్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్ ని కోరగా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తదనంతరం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రంలోని ఎద్దులను పరిశీలించారు వాటి నుండి వీర్యం తీసే ప్రక్రియను, తద్వారా వచ్చే తుది ఉత్పత్తి స్టోర్ యూనిట్ గురించి పశుసంవర్ధక శాఖ అధికారి కలెక్టర్ కి వివరించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News