Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collector: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలి

Kurnool Collector: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలి

నర్సరీలను రైతులు వినియోగించుకోవాలి

జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. ఆలూరు మండల కేంద్రం సమీపంలో మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ నర్సరీని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సందర్శించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు నర్సరీలను నిర్వహించడం జరుగుతోందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

ఆలూరు, బనవాసి, కాల్వబుగ్గ లో ఈ నర్సరీలను పెంచడం జరుగుతోందని ఈ నర్సరీల్లో సీతాఫలం, నేరేడు, జామ, ఉసిరి, మామిడి, నిమ్మ, దానిమ్మ, మునగ లాంటి పండ్ల మొక్కలతో పాటు ఇతర జాతి మొక్కలైన టేకు, గోరింటాకు, తెల్లమద్ది తదితర మొక్కలను పెంచుతున్నారన్నారు. బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, పాఠశాల ఆవరణలు తదితర ప్రాంతాల్లో మొక్కలను నాటి పచ్చదనం మరింతగా పెంచాలని కలెక్టర్ సూచించారు. అలాగే సీతాఫలం, నేరేడు, జామ, ఉసిరి, మామిడి, నిమ్మ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలను రైతులు వినియోగించుకుని జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వంద శాతం బ్రతికేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా నర్సరీలో కలెక్టర్ నేరేడు మొక్కను నాటారు. డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నర్సరీ లో 2,50,000 మొక్కలు అందుబాటులో ఉండగా రైతులకు, ఇతర జిల్లాలకు, అటవీ శాఖ అధికారులకు, విద్యా సంస్థలకు, కార్యాలయాలకు 2,30,000 మొక్కలు ఇవ్వడం జరిగిందని, ఇంకా 20 వేల కు పైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. బనవాసి నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, జిల్లా అటవీ శాఖాధికారి శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News