Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఇంట్లో కూర్చోకండి, బయటకొచ్చి ఓటేయండి

Kurnool: ఇంట్లో కూర్చోకండి, బయటకొచ్చి ఓటేయండి

కర్నూల్ కలెక్టర్ ర్యాలీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. ఆదోని మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా జి.సృజన జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరుపున ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు యొక్క ప్రాముఖ్యతను ఆదోని ప్రజలందరికీ తెలియచేయడమే ఈ ర్యాలీ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, ఓటు హక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకునే సమయంలో ఏవైనా ఆటంకాలు ఎదురవొచ్చు అది వ్యవస్థ రూపంలో కావచ్చు, బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు అటువంటి భయాలు ఏవి లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు.

ఆదోని పట్టణ వాసులందరూ కూడా వారి బాధ్యతగా మే 13వ తేదీన జరిగే పోలింగ్ కి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుని మన భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా ప్రజాస్వామ్యానికి సహకరించాలని కోరారు. వ్యవస్థ, జిల్లా యంత్రాంగం తరపున ఓటర్లకి ఎటువంటి అసౌకర్యాలు గాని, ఇతరుల నుండి భయం, ప్రలోభాలకు గాని లోను కాకుండా ఒక మంచి సురక్షితమైన పర్యావరణం అందిస్తామనే భరోసా కల్పించుట కొరకు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ తో పాటు, ప్రజలు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలనే ర్యాలీని నిర్వహించామన్నారు. ప్రజలందరూ ఇళ్లలో కూర్చోకుండా, బయటకు వచ్చి పెద్ద ఎత్తున బాధ్యతతో పోలింగ్ లో పాల్గొనాలని, ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉందని కలెక్టర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. మెప్మా సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు ” ఓటు హక్కు మన ఆయుధం” అనే నినాదాల ద్వారా ఈరోజు ఏ విధంగా అయితే ప్రజలందరికీ తెలియజేస్తున్నారో అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మరొక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇప్పటివరకు మీ ఓటు హక్కు ఉన్నదో లేదో చూసుకోవాలని, ఒకవేళ లేదంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎన్రోల్ చేయించుకొనుటకు సమయం ఉన్నందున ఎన్రోల్ చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ సందేశాన్ని ఆదోనిలో ఉండే ప్రజలందరికీ చేరే విధంగా పబ్లిసిటీ చేయాలని మీడియా వారిని కోరారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ మే 13 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయన్నారు. ప్రజలందరూ కూడా ఇతరులు ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్ఛగా వారి ఓట్ హక్కును వినియోగించుకోవాలని కోరారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన అని జాగ్రత్తలను తీసుకుంటామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆదోని డిఎస్పీ శివ నారాయణ్ స్వామి, ఆదోని తహసిల్దార్ హసీనా సుల్తానా, ఆదోని మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News