Friday, October 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: బన్ని ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

Kurnool: బన్ని ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి

ఎవరూ గాయపడరాదు

ఈ నెల 12 న జరుగబోయే దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫు నుంచి చేయవలసిన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.

- Advertisement -

శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో దేవరగట్టు బన్ని ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట, దేవరగట్టు గ్రామాల ప్రజలు బన్ని ఉత్సవాన్ని పండుగలా నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరూ గాయపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో ఉత్సవం జరుపుకోవాలని కలెక్టర్ నాలుగు గ్రామాల నుంచి హాజరైన సభ్యులకు సూచించారు. ఉత్సవ నిర్వహణకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

2 లక్షల మంది, 100 సీసీ కెమరాలు..

మిటీ సభ్యుల కోరిక మేరకు సుమారు 2 లక్షల మంది ప్రజలకు త్రాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. అదే విధంగా దేవరగట్టు బన్ని ఉత్సవాలపై డివిజనల్ స్థాయిలో కూడా సమీక్ష చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ కు సూచించారు. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లను చూసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. నెరణికి, దేవరగట్టు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అరికెర, దేవరగట్టు, నెరణికి నుండి దేవరగట్టు వరకు రోడ్లను పరిశీలించి ఎస్టిమేట్ సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

టెంపరరీ ఆసుపత్రి కూడా..

సత్వర వైద్యసేవలకై అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 4 అంబులెన్సులు, టెంపరరీగా 20 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాలని, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఎంహెచ్వో ను ఆదేశించారు. బన్ని ఉత్సవం రోజున అక్రమ మద్యం సరఫరా, మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అబ్కారీ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. మైక్ సిస్టం, లైట్ అరేంజ్మెంట్ తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య మాట్లాడుతూ దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయం పేరుతో కొట్టుకోకుండా, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాన్ని జరుపుకొని ప్రజలకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నాలుగు గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహించుకుని అవగాహన కల్పించాలని కమిటీ సభ్యులకు జేసీ సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ మాళా సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, పత్తికొండ డిఎస్పి వెంకట్రామయ్య, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, ఆయా శాఖల జిల్లా అధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News