Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: తల్లుల ఖాతాల్లో రూ.23.60 కోట్లు జమ: కలెక్టర్

Kurnool: తల్లుల ఖాతాల్లో రూ.23.60 కోట్లు జమ: కలెక్టర్

‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా జనవరి 2023-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జిల్లా వ్యాప్తంగా అర్హులయిన 30,636 మంది విద్యార్థులకు సంబంధించిన 27,811 మంది తల్లుల ఖాతాల్లో రూ.23.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జనవరి 2023 నుండి మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్న విద్యా దీవెన ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస కుమార్, మైనారిటీ సంక్షేమ అధికారి సభిహ పర్వీన్, బీసీ సంక్షేమ అధికారులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు వారికి నచ్చిన కోర్సుల్లో విద్యను అభ్యసించడమే కాక, వారికి ఎటువంటి ఆర్థిక కష్టాలు రాకుండా ప్రభుత్వమే వారి ఫీజును పూర్తి స్థాయిలో ఫీ రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లించడంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలైన జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాలతో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. విద్యతో మాత్రమే కుటుంబాల రూపు రేఖలు మారే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు విద్యను అభ్యసించి రాబోయే తరాలకు మార్గనిర్దేశంగా ఉండాలన్నారు. విద్యార్థులు అందరూ ఇలాంటి అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. అదే విధంగా తల్లుల ఖాతాల్లో జమ అయిన నగదును పది రోజులలోపు కాలేజీ యాజమాన్యాలకు చెల్లించడంతో పాటు కాలేజీలలో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించాలని కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన క్రింద 30,636 మంది విద్యార్థులు, 27,811 మంది తల్లుల ఖాతాలలో రూ.23.60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమం ద్వారా 157 మంది విద్యార్థులకు రూ.27.8లక్షలు, ఎస్టీ సంక్షేమం ద్వారా 710 మంది విద్యార్థులకు రూ.54.5లక్షలు, బీసీ సంక్షేమం ద్వారా 21,512 మంది విద్యార్థులకు రూ.15.89 కోట్లు, ఈబిసి సంక్షేమం ద్వారా 2153 విద్యార్థులకు రూ.2.57 కోట్లు, కాపు సంక్షేమం ద్వారా 789 మంది విద్యార్థులు రూ.73.7లక్షలు, మైనారిటీ సంక్షేమం ద్వారా 5184 మంది ముస్లిం విద్యార్థులు రూ.3.65 కోట్లు, క్రిస్టియన్ సంక్షేమం ద్వారా 131 మంది విద్యార్థులకు రూ.17లక్షలు లబ్ది పొందారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బంగారు బాటలు వేసిందన్నారు. పేదరికం నుంచి బయట పడటానికి కేవలం చదువు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. పెద్ద చదువులు అన్ని కూడా పేద వారికి హక్కులా అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద జనవరి 2023 నుండి మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన పూర్తి స్థాయి ఫీ రీయింబర్స్మెంట్ రూ.23.60 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News