కర్నూల్ ( తెలుగు ప్రభ ) : పుట్టినా.. గిట్టినా.. ఆ కాగితం చేతికి రావాలంటే జేబులు గుల్ల కావాల్సిందేనా? నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ‘వారం పది రోజులు ఆగాలి’ అంటూ కొర్రీలు పెట్టే అధికారులు.. అదే దళారుల చేతులు తడిపితే ‘నిమిషాల్లో’ సర్టిఫికెట్ ఎలా చేతిలో పెడుతున్నారు? సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కర్నూలు నగరపాలక సంస్థ (కేఎంసీ) కార్యాలయంలో సాగుతున్న ఈ ‘అక్రమ దందా’ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? పారదర్శక పాలన అందిస్తున్నామన్న పాలకుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నడుస్తున్న దోపిడీకి ఎందుకింత వ్యత్యాసం?
దరఖాస్తుకు తిప్పలు.. దళారులకు వందనాలు : పాఠశాల ప్రవేశాల నుంచి మొదలుకొని ఆధార్, పాస్‌పోర్టు, బీమా క్లెయిమ్‌లు, ఆస్తి రిజిస్ట్రేషన్ల వరకు ప్రతి పనికీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అత్యవసరం. నిబంధనల ప్రకారం పౌరులు గ్రామ, వార్డు సచివాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నిర్దేశిత రుసుము చెల్లించి వీటిని పొందవచ్చు. కానీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఒక సామాన్య పౌరుడు కార్యాలయానికి వెళ్లి అధికారిని కలిస్తే.. “సర్వర్‌లో సమస్య ఉంది”, “పరిశీలనకు సమయం పడుతుంది.. వారం లేదా పది రోజుల తర్వాత రండి” అంటూ కాలయాపన చేస్తుంటారు. అదే సమయంలో గేటు వద్ద మాటువేసిన దళారులు రంగప్రవేశం చేస్తారు. బాధితుల ఆందోళనను పసిగట్టి, “మాతో రండి.. అరగంటలో సర్టిఫికెట్ చేతికి ఇప్పిస్తాం” అంటూ బేరసారాలు ప్రారంభిస్తారు.
ప్రభుత్వ రుసుము నామమాత్రం.. దళారుల రేటు వేలల్లో : ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనన, మరణాల నమోదు మరియు సర్టిఫికెట్ల ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.
సకాలంలో నమోదు (21 రోజుల లోపు): నమోదు పూర్తిగా ఉచితం; సర్టిఫికెట్ కాపీకి కేవలం రూ.30 సర్వీస్ ఛార్జ్.
ఆలస్య నమోదు (నిర్ణీత గడువు దాటితే): నిర్ణీత లేట్ ఫీజు (రూ.25 నుంచి రూ.250 వరకు) మాత్రమే వర్తిస్తుంది.
అయితే, కేఎంసీలో వాస్తవ పరిస్థితి చూస్తే: ఒక్కో ధ్రువపత్రానికి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు అక్రమంగా డిమాండ్ చేస్తున్నారు. అర్జంటు అవసరమున్న వారిని, దూరప్రాంతాల నుంచి వచ్చే వారిని, వృద్ధులు, దివ్యాంగులను సైతం వదలకుండా నిలువుదోపిడీ చేస్తున్నారు.
బాధితుల గోడు ఇది : ఇటీవల పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన పాత జనన ధ్రువీకరణ పత్రం పోగొట్టుకుని, పునఃముద్రణ కోసం కర్నూలు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ అధికారిని సంప్రదించగా దరఖాస్తు సమర్పించి 10 రోజుల తర్వాత రావాలని బదులిచ్చారు. చేసేది లేక బయటకు వస్తుండగా మధ్యవర్తి ఒకరు ఎదురై, రూ.1,000 ఇస్తే నిమిషాల్లో తెచ్చిస్తానని హామీ ఇచ్చాడు. అత్యవసరం కావడంతో ఆ వ్యక్తి డబ్బులు ముట్టజెప్పగానే, క్షణాల వ్యవధిలోనే అధికారిక పత్రం చేతికి రావడం కార్పొరేషన్‌లోని అంతర్గత కుమ్మక్కును బట్టబయలు చేస్తోంది.
అధికారుల మౌనం.. అవినీతికి ఆమోదమా? : ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై బాధితులు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, క్షేత్రస్థాయిలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు లంచాల వాటాలు చేరుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల డిమాండ్: కార్యాలయంలో సీసీటీవీ నిఘాను పటిష్టం చేసి దళారుల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టాలి. నిర్దేశిత ఫీజుల వివరాల బోర్డులను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి. సేవాహక్కు చట్టం ప్రకారం దరఖాస్తులను గడువులోగా పారదర్శకంగా పరిష్కరించి, అక్రమార్కులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

