Homeఆంధ్రప్రదేశ్Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి.. సిపిఐ నేత ఆవుల శేఖర్ డిమాండ్

Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి.. సిపిఐ నేత ఆవుల శేఖర్ డిమాండ్

కోడుమూరు (తెలుగుప్రభ): కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి, తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కోడుమూరు రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి డి.శేషుకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆవుల శేఖర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అరకొర వర్షాలతో పత్తి, వేరుశనగ, సజ్జ, జొన్న, కంది, మిరప తదితర పంటలు మొక్కదశలోనే ఎండిపోయాయని, ఒక్కో ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. వర్షాలు కురుస్తాయనే ఆశతో సాగు చేసిన రైతులకు చివరకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను విస్తృతంగా ప్రారంభించి కార్మికుల వలసలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు కరువు పెన్షన్‌గా నెలకు రూ.20 వేల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని, నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. సీపీఐ మండల కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ.. రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ రద్దు చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం పంటలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురిస్తే రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు తహశీల్దార్ నాగరాజుకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి డి.భాస్కర్, నాయకులు శివశంకర్, రైతు సంఘం నాయకులు గొల్ల రాజు, అచ్చన్న, శంకర్, గిడ్డయ్య, లక్ష్మయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు సులోచనమ్మ, ఫాతిమాబి, బాలమ్మ, బీకేఎంయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు కుళాయిల రాముడు, ఈశ్వరయ్య ఆచారి, కాటన్న గారి నాగరాజు, రంగడు, ఏఐఎస్ఎఫ్ నాయకుడు రంగస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు, విజయ్, కిషోర్, ఏఐటీయూసీ నాయకులు బజారి, నాగరాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు బాబురావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: Politics : బాంకీపూర్ బరిలో ప్రశాంత్ కిశోర్ భేరి.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన జన్ సురాజ్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News