Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: మాతృ మరణాలు జరగకుండా కఠిన చర్యలు: కలెక్టర్ సృజన

Kurnool: మాతృ మరణాలు జరగకుండా కఠిన చర్యలు: కలెక్టర్ సృజన

కర్నూలు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనమీద ఉందని అందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అనుమతి లేని స్కానింగ్ సెంటర్ల మీద ప్రత్యేక నిఘా ఉంచాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మాతృ మరణాలు నివారణ తదితర అంశాలపై వైద్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ మాత శిశు మరణాలపై సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా నగరంలో ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సదరు స్కానింగ్ యంత్రాల వివరాలు కూడా సేకరించాలన్నారు. అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టప్రకారం చర్యలు తప్పవని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్లు గ్రామాలలో అందుబాటులో లేని సమయంలో ఆయాలు నిత్యం గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా రక్తహీనత కలిగిన వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందజేసేలా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఒకరికంటే ఎక్కువ అమ్మాయిలకు జన్మనిచ్చిన తల్లుల వివరాలు ప్రత్యేకంగా తయారు చేయాలని డిఎంహెచ్ఓ, ఐసిడిఎస్ పిడి ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆశా, ఏఎన్ఎం మీద ఉందన్నారు. ఒకవేళ వివాహాలను ఆపలేకపోతే ఐసిడిఎస్ అధికారులకు తెలియజేయాలన్నారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఇద్దరికి జన్మనిచ్చిన గర్భిణీ స్త్రీ సంబంధీకులకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల్లో ఏఎన్ఎం లేని సచివాలయాలు ఎన్ని ఉన్నాయో సదరు వివరాలను తెలపాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో గర్భిణీ స్త్రీలను పరిశీలించడానికి పోర్టబుల్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని గైనిక్ హెచ్ఓడి జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో బాల్య వివాహాల పట్ల ముమ్మరంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ క్లినిక్స్, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను నిత్యం పరిశీలిస్తూ ఉండాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, డిసిహెచ్ఎస్, పిహెచ్సి డాక్టర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News