రాయలసీమ యూనివర్సిటీని గాడిలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఉపకులపతి డాక్టర్ వి వెంకట బసవరావు అన్నారు. బుధవారం వర్సిటీ ఉపకులపతి చాంబర్లో ఆయన ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకత శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు.
గ్రేడ్ పెంపే లక్ష్యంగా
న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి ఫ్యాకల్టీ క్లాసులో బోధనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమం రూపొందించుకొని పనులు అప్పగిస్తానని తెలిపారు. బోధనలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, అధ్యాపకుల సమన్వయంతో పనిచేసే వాతావరణం కల్పించి ఆదర్శ యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితులపై అధ్యయనం చేసి ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు కార్యచరణను రూపొందించుకొని మంచి పనితీరు ప్రదర్శించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.