ఆగస్టు 21న విజయవాడ నగరంలో ఏపీఎన్జీవో 22వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని జిల్లా ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షులు వెంగల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అసోసియేషన్ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం నేతలు కార్యవర్గ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి మహాసభలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ఆ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా నివేదిక అందిస్తామని ఆ సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 1500 మంది హాజరుకావాలని అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యంగా ఆ సమావేశంలో బైలా కమిటీ చైర్మన్గా తనను నియమించినట్లు తెలిపారు.
సమస్యలన్నీ నూటికి నూరు శాతం పరిష్కారం కావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొని అధ్యక్షునికి పలు సమస్యలు వివరించారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవహర్ లాల్, కర్నూలు నగర అధ్యక్షులు ఎంసీ కాశన్న, కార్యదర్శులు పాండురంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల తాలూకా అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.