కర్నూలు (తెలుగు ప్రభ): కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కర్నూలు అసెంబ్లీ ఓటరు నమోదు అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం బీఎల్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లతో ఈఆర్వో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫారం-6 సమర్పించవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు, అనర్హుల పేర్ల తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలు లేదా నివాస మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతతో పాటు ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఆర్వో సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో కూడా పరిశీలించుకోవాలని తెలిపారు.
క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉన్నందున అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

