- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి గెలిపించారు
- నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ శుభాకాంక్షలు
కర్నూలు (తెలుగు ప్రభ): ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నూతన కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సూచించారు. కర్నూలు నగరంలో విజయం సాధించిన పలువురు నూతన కార్పొరేటర్లు బుధవారం మంత్రి టీజీ భరత్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు బాధ్యతలు అప్పగించారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో ప్రజాసేవ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. నగరంలోని ప్రతి వీధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నూతన కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవి అనేది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

