Political Violence in Kurnool District : శాంతిభద్రతలకు నిలయంగా ఉండాల్సిన సీమ గడ్డపై మళ్లీ కక్షల దావాగ్ని రాజుకుంటోందా? రౌడీ మూకల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించినా, క్షేత్రస్థాయిలో అల్లర్లు, అరాచకాలు ఎందుకు ఆపలేకపోతున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వయంగా ఇళ్లపై దాడులకు తెగబడటం, గంటల వ్యవధిలోనే పాతబస్తీలో ఒక టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది.
అర్ధరాత్రి వేళ అలజడి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత నెల 25న ఆస్పరి గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆ ఆదేశాల వేడి చల్లారకముందే, ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి దౌర్జన్యాలకు దిగినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో అర్థరాత్రి సమయంలో గుంపులుగా వచ్చి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లవర్షం కురిపించారు. ఈ క్రమంలో టీడీపీ కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డుకోబోయిన ఒక దళిత మహిళపై భౌతిక దాడికి దిగి, ఆమె దుస్తులు చించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఎమ్మెల్యే సమక్షంలోనే ఉసిగొల్పు వ్యాఖ్యలు : ఈ దాడి ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు ప్రవర్తించిన తీరు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, “టీడీపీ కార్యకర్తలను ఎవరినీ వదలొద్దు.. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా ఉపేక్షించేది లేదు. వారి గొంతులు కోయండిరా, ఎవడొస్తాడో చూస్తాం” అంటూ బహిరంగంగా ఉసిగొల్పడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఒక గ్రామంలో దాడి చేసి, అనంతరం మరో గ్రామానికి వెళ్లి వైకాపా వర్గీయులు అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు సమర్థవంతంగా నిరోధించలేకపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక ఎన్నికల కక్షలు: ఆలూరు నియోజకవర్గ ఘటన మరువకముందే, కర్నూలు పాతబస్తీలో దారుణ హత్య చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యర్థులు పక్కా పథకం ప్రకారం చంపేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ వార్డు స్థానంలో తమ పోటీకి అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉస్తాద్ మహబూబ్ తన అనుచరులతో కలిసి ఈ హత్య చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఉస్తాద్ మహబూబ్, ఉమ్రాన్, జవాద్, ఇర్ఫాజ్‌లతో పాటు మరికొందరిపై హత్య కేసులు నమోదు చేశారు.
ఓటమి భయంతోనే అలజడులు : కర్నూలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరయాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. “రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే వైకాపా నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా అల్లర్లు సృష్టిస్తున్నారు. అధికార పార్టీ శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నగరంలో ఇలాంటి హత్యలు, అల్లర్లు పునరావృతం కాకుండా తక్షణమే రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

