Kurnool: కేశవరెడ్డిలో ఘనంగా జోనల్ క్రీడోత్సవాలు
– ఏడు బ్రాంచ్ల విద్యార్థుల మధ్య పోటీలు ప్రారంభం
– 500 మంది విద్యార్థులతో మార్చ్ఫాస్ట్.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కర్నూలు (తెలుగు ప్రభ): నగరంలోని కేశవరెడ్డి పాఠశాలలకు చెందిన ఏడు బ్రాంచ్ల విద్యార్థుల మధ్య జోనల్ క్రీడోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. కేశవరెడ్డికి విద్యార్థులు నృత్యగీతాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి క్రీడోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులు ప్రదర్శించిన ‘జయహో’ నృత్యం, దశావతారాల నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 500 మంది విద్యార్థులతో నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎన్. కేశవరెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు కూడా తమ పాఠశాలల్లో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.


