East Godavari : తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన కాలజ్ఞానంపై చాలా మందికి అపారమైన నమ్మకం ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లు పలు ఘటనలు జరిగాయని, మరికొన్ని జరగనున్నాయని చెబుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా అది బ్రహ్మంగారు ముందే చెప్పారు అనే వారికి కొదవ లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత చోటు చేసుకుంది.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది తెలిసిపోతుంది. ఏపీలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మురళినగర్‌లో దేవిశెట్టి రత్నాజీ అనే రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లోని గేదెకు ఓ దూడ జన్మించింది. అయితే.. ఆ దూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా క్షణాల్లో ఊరంతా తెలిసింది.
వెంటనే గ్రామ ప్రజలు అతడి ఇంటికి తరలివచ్చారు. ఆ దూడెను చూసి ఇదేమి వింత అంటూ చర్చించుకుంటున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు జరిగిందని అంటున్నారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వింత ఏంటని అంటారా.. ఆ దూడెకు 8 కాళ్లు ఉన్నాయి. సాధారణంగా దూడెలకు నాలుగు కాళ్లు మాత్రమే ఉంటాయన్న సంగతి తెలిసిందే.
దీనిపై పశువైద్యులను సంప్రదించగా జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని చెప్పారు. ఇందులో వింత ఏమీ లేదన్నారు. అయితే.. ఇలా జన్యుపరమైన లోపాలతో జన్మించినవి ఎక్కువ రోజులు బతకడం చాలా కష్టం అని అన్నారు.