Land allocation to 114 institutions in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కేటాయింపులు. నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాకు పలు కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయన్నారు. అయితే, ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాల వల్ల తమ కేటాయింపులను రద్దు చేసుకోగా.. మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు. అమరావతిలో స్టూడియోలు లేదా ఇతర సంస్థల స్థాపన కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే, ముంబైకి చెందిన కొన్ని ప్రముఖ సినీ, వ్యాపార సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
Also Read: Pawan kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ.. అధినేత ప్రత్యేక ఫోకస్.. జూన్ 2న కీలక ప్రకటన..!
వాటి ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించాకే కేటాయింపులు..
కాగా, అమరావతిలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే కేటాయింపు జరుపుతామని, అందుకోసం సదరు సంస్థల ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు, బ్యాలెన్స్ షీట్లను సమర్పించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, డీజిల్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినప్పటికీ.. అమరావతి రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని కావడంతో పనులను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో భూములు త్యాగం చేశారని, కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పనులను నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను కాపాడటమే మా కర్తవ్యమని నారాయణ వ్యాఖ్యానించారు. రైతులు ఇబ్బంది పడకుండా రాజధాని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

