Telugu states: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భానుడు భగభగలాడుతుంటే.. మరికొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD)విపత్తు ప్రజలకు బిగ్ అలెర్ట్ జారీ చేశాయి.
వడగాల్పులు మరియు పిడుగుల హెచ్చరిక: ఏపీలో వింత వాతావరణం కనిపిస్తోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు మరియు పోలవరం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. రాయలసీమలోని కడపలో ఉష్ణోగ్రతలు 40.7°C దాటే అవకాశం ఉంది.
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం: తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నిన్న అర్ధరాత్రి నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.
ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు: ఎండ సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండవద్దు. ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి.

