weather Forecast Update: నైరుతి రుతుపవనాల తిరోగమనంతో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి తిరోగమనంతో పాటుగా ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా అల్పపీడన ప్రభావం సైతం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీపై ఈశాన్య ప్రభావం: ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం వంటి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈదురు గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.
తెలంగాణలో వెదర్ రిపోర్ట్: తెలంగాణ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కొంత చలితీవ్రత పెరిగింది. మధ్యాహ్న వేళలో పొడి వాతావరణంతో కూడిన ఎండ ఉన్నప్పటికీ.. సాయంత్రం తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ వంటి తూర్పు జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలైన నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 27°C, కనిష్ఠంగా 17°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి, తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.


