Telugu states: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల భానుడు భగభగలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో వింత వాతావరణం: ఏపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, నెల్లూరు మరియు పోలవరం ప్రాంతంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఓ వైపు వర్షాలు పడుతుంటే మరోవైపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. దీంతో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలో అకాల వర్షాలు: తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిన్న అర్ధరాత్రి నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ.. విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండవద్దని వాతావరణశాఖ అధికారులు కోరుతున్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

