YS Jagan Tweet on Srisailam: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తి భావం కంటే పోలీసుల లాఠీలే ఎక్కువగా వినిపించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. శివమాల ధారణలో ఉన్న భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా బలప్రయోగం చేయడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో భక్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వహణ లోపం.. భక్తుల ఆక్రందన!
ప్రతి ఏటా మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి వస్తుంటారు. అయితే, ఈసారి ప్రభుత్వం పాదయాత్రగా వచ్చే భక్తులకు ఇచ్చే సమయాన్ని 7 రోజులకు కుదించడం వివాదానికి దారితీసింది . క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు కనీసం తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. అసౌకర్యాలపై నిలదీసిన భక్తులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడటంతో పిల్లాపాపలతో వచ్చిన కుటుంబాలు భయభ్రాంతులకు గురయ్యారు.
Also Read:AP Assembly – ఏపీ అసెంబ్లీలో డిజిటల్ హాజరు..
ప్రభుత్వంపై జగన్ విమర్శనాస్త్రాలు
“చంద్రబాబు పాలనలో భక్తులు ఆలయాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తిరుపతి మొదలుకొని శ్రీశైలం వరకు వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు” అని జగన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్నారంటేనే ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతోందని, కేవలం ప్రచార విన్యాసాలకే ప్రభుత్వం పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు.
అనిశ్చితిలో ఆధ్యాత్మిక క్షేత్రాలు?
గతంలో తిరుపతిలో జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలను గుర్తు చేస్తూ, భక్తుల విశ్వాసాన్ని కూలదోసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. బాధ్యత గల యంత్రాంగం భక్తులను ఆదుకోవాల్సింది పోయి, లాఠీలతో కొట్టి తరిమడం ప్రజాస్వామ్యంలో దారుణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

