తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుతను భక్తులు చూసినట్లు చెబుతున్నారు. వెంటనే అలెర్ట్ అయిన టీటీడీ.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. దీంతో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది.
చిరుతను శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల క్యూలైన్ల సమీపంలో చూసినట్లు భక్తులు చెబుతుండటంతో.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తిరుమలలో గతంలో కూడా చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. అనంతరం అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా పలు చర్యలు తీసుకున్నారు. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరుత సర్వదర్శనం క్యూలైన్ సమీపంలో కనిపించడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.