కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మందుబాబులకు మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులను తీసివేసి ప్రైవేట్ షాపులను కేటాయించింది. అలాగే నాసిరకం మద్యం స్థానంలో బ్రాండెడ్ కంపెనీల మద్యం అమ్మకాలు చేపట్టింది. దీంతో ఫుల్ కిక్‌లో ఉన్న మందుబాబులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే మద్యం ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మద్యం కంపెనీలు బేసిక్ ప్రైజ్‌ను తగ్గించాయి. అదేవిధంగా రాష్ట్ర బెవరేజస్ సంస్థ (State Beverage Corporation) కూడా ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర తగ్గించడంతో మద్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఒక్కో క్వార్టర్ బాటిల్ ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గే అవకాశం ఉంది.
కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మద్యం కంపెనీలు బేసిక్ ప్రైజ్ తగ్గించడంతో మద్యం ధరలు తగ్గనున్నాయి. దీంతో మందుబాబులు సంబరాలు చేసుకుంటున్నారు.