ఏపీ మద్యం కుంభకోణం(AP Liquor Scam) కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో(Supreme Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూ ఈ పిటిషన్లను కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని న్యాయస్థానం పేర్కొంది.
మద్యం కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని కీలక నిందితులుగా సిట్ చేర్చిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్‌కు ఈ ముగ్గురు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ఇప్పటికే గోవిందప్ప బాలాజీని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వీరిని అరెస్ట్ చేసుందుకు సిట్ అధికారులకు అడ్డంకులు తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.