Amaravathi: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. దిగువ సభ ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఈ బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) వైఖరి చర్చనీయాంశంగా మారింది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే.. సాంకేతిక కారణాలు చూపుతూ సభలో ఈ బిల్లును వ్యతిరేకించింది.
బిల్లుపై విస్తృత చర్చ: లోక్‌సభలో ‘ఏపీ పునర్విభజన సవరణ చట్టం’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పలువురు కేంద్ర మంత్రులు అన్నారు. విభజన హామీల అమలులో భాగంగానే ఈ చట్టబద్ధత కల్పిస్తున్నామని తెలిపారు.
Also read-Ontimitta: నేడు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు దంపతులు
కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఏపీ రాజధాని అంశానికి మద్దతు లభించింది. దీంతో బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. దీంతో ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లు చట్టరూపంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటరీ స్థాయి రక్షణ లభించనుంది.

