Nara Lokesh vs YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యంపై విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల తమ పాలనలో వేలాదిమంది ప్రాణాలు తీసిన ‘జే బ్రాండ్స్’ చరిత్రను మర్చిపోయి కల్తీ మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు ఎక్కడుందని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
నిందితులను పట్టుకుంది మా ప్రభుత్వమే
తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నది, కేసు నమోదు చేసింది తమ ప్రభుత్వమేనని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలను గుర్తించి, వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, చట్టపరమైన చర్యలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.
‘జే బ్రాండ్స్’ విషం మర్చిపోయారా?
గత వైఎస్సార్‌సీపీ పాలనలో తీసుకొచ్చిన ‘జే బ్రాండ్స్’ వల్ల నాణ్యతలేని మద్యం తాగి వేలాదిమంది ప్రజల కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడయ్యాయని, మరణాలు సంభవించాయని లోకేశ్ ఆరోపించారు. ధరలు పెంచి ఆదాయం దోచుకోవడమే కాక, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కల్తీ మద్యం తాగి చనిపోయినవారిని సైతం ‘సహజ మరణాల’ కింద చూపించి, నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.
జోగి రమేశ్ అహంకారం మరువద్దు
అంతేకాక, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం బాధితుల పట్ల వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ వ్యవహరించిన తీరును లోకేశ్ ప్రస్తావించారు. “పోతే పోయారు.. ఇంకా ఏడుస్తారేంటీ?” అంటూ ఆయన బాధితుల పట్ల అహంకారంగా మాట్లాడటం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని లోకేశ్ మండిపడ్డారు.
తమ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి, ప్రైవేట్ రిటైల్ దుకాణాలను పునరుద్ధరించి, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తుంటే, వైఎస్సార్‌సీపీ మాత్రం తమ ఐదేళ్ల పాపాలను మర్చిపోయి విమర్శలు చేయడంలో అర్థం లేదని మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.


