విద్యాలయాలు విద్యార్ధులకు జ్ఞానం అందించే పవిత్రమైన స్థలాలవిగా అందరూ భావిస్తారు.. అయితే కొన్ని కళాశాలల్లో విద్యార్థినిలకు భద్రత లేని వాతావరణం ఏర్పడుతోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఓ ఇంటర్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడి ప్రైవేట్ జూనియర్ కాలేజీకి చెందిన కరస్పాండెంట్ నాగిరెడ్డి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితురాలి సమాచారం ప్రకారం, అతడు శారీరకంగా తాకుతూ అసభ్యకరంగా వేధించడమే కాకుండా, రాత్రిపూట ఫోన్లు చేసి అశ్లీల సందేశాలు పంపుతూ మానసిక హింసకు గురిచేశాడని తెలిపింది. తనపై జరుగుతున్న వేధింపుల గురించి బాధిత విద్యార్థిని చివరికి తల్లిదండ్రులకు వివరించింది. దీనితో ఆగ్రహానికి గురైన వారు వెంటనే కాలేజీకి వెళ్లి కరస్పాండెంట్ నాగిరెడ్డిని చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయగా, వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు నాగిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థలలోనే ఇటువంటి దారుణాలు జరగడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినుల భద్రతపై సంబందిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.