ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు(Srisailam Brahmotsavams) ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ఈ రోజు రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 20 రాత్రి భృంగివాహన సేవ ఉంటుంది. 21వ తేదీన హంసవాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. 22న మయూర వాహన సేవ, 23న రావణ వాహన సేవ, 24న పుష్ప పల్లకి సేవ, 25న గజవాహన సేవ, 26న మహా శివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం, నంది వాహనంపై శివపార్వతులు విహరిస్తారు.
ఇక ఈ నెల 23న సీఎం చంద్రబాబు(Chandrababu) ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని అర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉత్సవాలు నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.