కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని తిరుమల(Tirumala)కు ఓ భక్తుడు వచ్చాడు. మెట్ల మార్గంలో ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శనం చేసుకుని పరితపించాలనుకున్నాడు. అయితే మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. స్వామి దర్శనం చేసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.
తెలంగాణలోని షాద్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్(50) అనే వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నాడు. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు బయలుదేరాడు. 200 మెట్లు ఎక్కిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వెంకటేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మెట్ల మార్గంలో అత్యవసర చికిత్స కోసం ఏర్పాటు చేసిన క్లినిక్స్ నిర్వహణ సరిగా లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.